

దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కలిగిన విశ్వవిద్యాలయాలు, జాతీయ విద్యాసంస్థలు, కళాశాలలు, పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న విద్యాసంస్థలు డిసెంబర్ 6వ తేదీలోగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రంలో కనీసం 250 మంది పరీక్ష రాసేందుకు వీలైన సదుపాయాలు ఉండాలని, ఆన్‌లైన్ కేంద్రంలో ఒక్కో షిఫ్ట్‌కు 285 మంది పరీక్ష రాసేలా కంప్యూటర్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.
గతంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించిన ఎన్‌టీఏ.. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు రాసినా ఆశించిన స్పందన రాలేదు. కంప్యూటర్ల కొరత, అవసరమైన సాంకేతిక ప్రమాణాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. తెలంగాణలోని 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కేవలం బేగంపేట మహిళా కళాశాలలో మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు అనువైన సదుపాయాలు ఉన్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అవసరమైన వసతులు ఉన్న విద్యాసంస్థల నుంచి దరఖాస్తులను ఎన్‌టీఏ ఆహ్వానిస్తోంది. అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్షల్లో పరిశీలకులుగా పనిచేయడానికి అర్హులైన వారు కూడా డిసెంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!