

దీపావళి అమావాస్య మరుసటి రోజు కార్తిక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా జరుపుకోవడం సంప్రదాయం. శ్రీమద్భాగవతం, విష్ణు పురాణం ప్రకారం బలి చక్రవర్తి మహాభక్తుడైన ప్రహ్లాదుడి మనుమడు. విష్ణుభక్తుడిగా పేరొందిన ఆయన ప్రజారంజక పాలకుడిగా గుర్తింపు పొందాడు. ఒకానొక సమయంలో విశ్వజిత్ యాగం నిర్వహించి అపారమైన శక్తిని సంపాదించిన బలి చక్రవర్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. దీంతో దేవతలు తమ అధికారాన్ని కోల్పోయి శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. దేవతలకు తిరిగి పూర్వ వైభవాన్ని కల్పించేందుకు విష్ణుమూర్తి కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు వామనుడిగా అవతరించాడు. బలి చక్రవర్తి అశ్వమేధ యాగం నిర్వహిస్తున్న సమయంలో యాగశాలకు చేరుకున్న వామనుడు దానంగా మూడు అడుగుల నేలను మాత్రమే కోరాడు. వామనుడు శ్రీమహావిష్ణువు అని రాక్షస గురువు శుక్రాచార్యుడు హెచ్చరించినప్పటికీ, విష్ణుభక్తుడైన బలి తన మాటకు కట్టుబడి దానం చేసేందుకు సిద్ధపడ్డాడు.
దానం స్వీకరించిన వామనుడు త్రివిక్రమ రూపాన్ని ధరించి మొదటి అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ వేయాలని అడగగా, బలి చక్రవర్తి తన శిరస్సును సమర్పించాడు. ఆయన దానగుణం, భక్తికి ముగ్ధుడైన శ్రీమహావిష్ణువు బలిని పాతాళలోకానికి చక్రవర్తిగా నియమించాడు. అలాగే బలి కోరిక మేరకు ఏడాదిలో మూడు రోజుల పాటు భూలోకానికి వచ్చి తన రాజ్యాన్ని సందర్శించే వరాన్ని అనుగ్రహించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీపావళి అమావాస్య, కార్తిక శుద్ధ పాడ్యమి రోజుల్లో బలి భూలోకానికి వస్తాడని భక్తుల విశ్వాసం. ఈ రోజుల్లో ఇళ్లలో దీపాలు వెలిగించి, దీపదానం, దీపపూజలు నిర్వహించడం శుభప్రదంగా భావిస్తారు. బలి పాడ్యమి సందర్భంగా వామనావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును, దానశీలి బలి చక్రవర్తిని పూజించడం సంప్రదాయం. అహంకారాన్ని విడిచిపెట్టి సత్వ, రజో, తమో గుణాలను అధిగమించి భక్తి, జ్ఞాన మార్గంలో పయనించాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!