

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు దగ్ధం కావడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు తమ వలలను షెడ్లలో భద్రపరిచారని, ఈ క్రమంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించిందని కలెక్టర్ వివరించారు. ఈ ప్రమాదంలో సుమారు 250 నుంచి 300 వలలు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా వేట విరామం కొనసాగుతున్న నేపథ్యంలో వలలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2.0 పథకం కింద దగ్ధమైన వలల స్థానంలో కొత్త వలలు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!