

విశ్వవిద్యాలయ డిగ్రీల కంటే ఐటీఐల్లో శిక్షణ పొంది వృత్తి నైపుణ్యాలు సాధించినవారికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్లంబర్ల వంటి వృత్తి నిపుణులకు ఇప్పటికే కొరత ఏర్పడిందని, కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో మార్పులు వచ్చినప్పటికీ సరైన నైపుణ్యాలు ఉన్నవారి ఉపాధికి ముప్పు ఉండదని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పుర్ ఐఐటీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఐటీఐ విద్యార్థులకు కూడా ఐఐటీ విద్యార్థులతో సమానమైన గౌరవం లభించాలని ఆకాంక్షించారు. భారత్ ప్రపంచ నైపుణ్య రాజధానిగా ఎదగాలని, 2027లో గ్రేటర్ నొయిడాలో ప్రపంచ నైపుణ్య పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రిటిష్ పాలనలో గుమస్తాలను తయారు చేసేలా విద్యావ్యవస్థను రూపొందించారని విమర్శిస్తూ, ప్రస్తుత కాలంలో సర్టిఫికెట్ల కంటే వాస్తవ నైపుణ్యాలకే ఎక్కువ విలువ ఉంటుందని వ్యాఖ్యానించారు.
సెమీకండక్టర్లు, అంతరిక్ష రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని మోదీ ప్రస్తావించారు. ప్రైవేటు సంస్థలకు అంతరిక్ష రంగంలో అవకాశాలు కల్పించడం వల్ల స్కైరూట్ ఏరోస్పేస్ వంటి సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయని, దేశ నిర్మాణంలో ఖరగ్‌పుర్ ఐఐటీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అనంతరం బిహార్‌లోని వైశాలీలో గంగానదిపై రూ.4,280 కోట్లతో నిర్మించిన ఆరు వరుసల ‘నీతీశ్ సేతు’ వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు, అవసరం లేనప్పుడు ఏడాదిపాటు బంగారం కొనుగోలు చేయవద్దని తాను చేసిన విజ్ఞప్తిని ప్రజలు పాటించారని, తద్వారా డబ్బు ఆదా చేసుకున్నారని మోదీ పేర్కొన్నారు. ప్రజల పొదుపు అలవాటును ప్రశంసిస్తూ, గతంలో లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపునకు స్పందించినట్లుగానే ప్రజలు ఇప్పుడు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించారని అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!