

అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో కీలక పురోగతి సాధించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీన శిలల మండలం (షియర్ జోన్)ను దాటడంతో పనులను మరింత వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా మెట్ట ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించేందుకు 2028 జూన్ నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగంతో పాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
గత ఐదారు నెలల్లో సొరంగం తవ్వకాలు అవుట్‌లెట్ వైపు సుమారు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్లు కలిపి మొత్తం 700 మీటర్లు ముందుకు సాగినట్లు ప్రాజెక్టు బృందం తెలిపింది. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగంలో సుమారు 79 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు మిగిలి ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సుమారు ఎనిమిది మీటర్ల పురోగతి నమోదవుతోందని పేర్కొంది. అదనపు డ్రిల్లింగ్ యంత్రాలు, జర్మనీ నుంచి రానున్న లోకోమోటివ్‌తో తవ్విన రాళ్లు, మట్టిని వేగంగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. సుమారు 7.1 కిలోమీటర్ల టన్నెల్-2లో లైనింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభమైనట్లు అధికారులు వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!