

తెలుగుదనాన్ని, మాతృభాషను కాపాడుకునేందుకు తెలుగువారంతా కంకణబద్ధులు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎన్ని ఆధునిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినా పుస్తకానికి ఉన్న విలువ ఎప్పటికీ తగ్గదని, పుస్తకాల్లో జీవన అనుభవాలు, లోతైన సత్యాలు నిక్షిప్తమై ఉంటాయని అన్నారు. పూర్వీకులు అందించిన విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో కస్తూరి విజయం పబ్లికేషన్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఇంక్‌బౌండ్ 2.0’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగూరి చిట్టెన్‌రాజు రచించిన ‘అవేమైనా జ్ఞాపకాలా.. మర్చిపోవడానికి?’, డా. ప్రవీణ్ యజ్జల రచించిన ‘స్క్రీన్‌ప్లే మాస్టర్ - సుకుమార్’, ‘అమ్మమ్మ కథల ఖజానా’, ‘గ్రాండ్‌మా గోల్డెన్ టేల్స్’ పుస్తకాలను ఆవిష్కరించారు.
ఆంగ్ల భాష మాత్రమే గొప్పదనే భావన నుంచి బయటకు రావాలని వెంకయ్య నాయుడు సూచించారు. యాంత్రికంగా మారుతున్న జీవనశైలిలో అందమైన జ్ఞాపకాలను, మానవ సంబంధాల మాధుర్యాన్ని వంగూరి చిట్టెన్‌రాజు తన రచన ద్వారా అందించారని ప్రశంసించారు. ‘స్క్రీన్‌ప్లే మాస్టర్ - సుకుమార్’ పుస్తకాన్ని తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి చూసే ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’ వంటి చిత్రాలు ప్రస్తుతం ఎక్కడున్నాయని ప్రశ్నించారు. తాను సినిమాలను విమర్శించడం లేదని, మారుతున్న సినిమా ధోరణిపై మాత్రమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి, నటుడు తనికెళ్ల భరణి, రచయిత వంశీ రామరాజు, అమెరికాకు చెందిన శ్రీనివాసరావుతో పాటు పలువురు రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!