

థాయ్‌లాండ్ రాణి సుథీదా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె జేఏఎస్ 39సీ గ్రిపెన్ యుద్ధ విమానంలో తన సోలో ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. సూరత్ థాని ప్రావిన్స్‌లోని వింగ్ 7 ఎయిర్‌బేస్ నుంచి ఈ ప్రయాణాన్ని చేపట్టారు. విమానయానంలో కఠిన శిక్షణ పొందుతున్న రాణి ఈ ఫ్లైట్‌ను విజయవంతంగా ముగించారు. రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ ఈ ప్రయాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, అనంతరం రాణిని అభినందించారు. ఈ ప్రత్యేక ఘట్టానికి సంబంధించిన వీడియోను థాయ్ రాజకుటుంబం అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
థాయ్ రాజదంపతులకు విమానయానంపై ఆసక్తి ఉండటం విశేషం. గతేడాది భూటాన్ పర్యటన సందర్భంగా రాజకుటుంబానికి చెందిన బోయింగ్ 737-800 విమానాన్ని రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ స్వయంగా నడపగా, రాణి సుథీదా కో-పైలట్‌గా వ్యవహరించారు. రాజుకు సైనిక విమానయానంలో అనుభవం ఉండటంతో పాటు ఎఫ్-5, ఎఫ్-16, బోయింగ్ 737-400 విమానాలను నడిపే అర్హత ఉంది. రాణి సుథీదా కూడా పలు పౌర విమానాలను నడిపారు. 2010లో పైలట్‌గా పనిచేయడం ప్రారంభించిన ఆమెకు, అందిన సమాచారం ప్రకారం, మొత్తం 1,188 గంటల విమానయాన అనుభవం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!