

వైద్యారోగ్యం నుంచి వ్యవసాయం వరకు వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికత, ఏఐ స్టాక్ సహాయంతో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు శాఖల పనితీరు, ప్రభుత్వ ఆదాయాలను పెంపొందించాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్)లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పౌరులకు ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థవంతంగా అందించాలని, ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా అందే ఫిర్యాదులను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పర్యవేక్షణ లోపాలను సరిదిద్దుకుంటూ ప్రతి శాఖ తన పనితీరును నిరంతరం సమీక్షించుకోవాలని సూచించారు. రెవెన్యూ, లీగల్ ఏఐ స్టాక్ ద్వారా వివిధ అంశాలను విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలు అత్యంత కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షణను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, ఆర్థిక, మున్సిపల్, ఇంధన శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆర్టీజీఎస్ అధికారులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!