

హిజాబ్ ధరించకుండా సంగీత ప్రదర్శన ఇచ్చిన ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీకి అక్కడి అధికారులు 74 కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు. ఆమెతో పాటు మరో నలుగురు సంగీత బృంద సభ్యులకు కూడా ఈ శిక్ష విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2024 డిసెంబర్‌లో ఖోమ్ నగరంలోని ఓ చారిత్రక ప్రదేశంలో అహ్మదీ హిజాబ్ లేకుండా పురుష సంగీతకారులతో కలిసి పాటలు పాడారు. ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన ఈ ప్రదర్శన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా భారీగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోపై కేసు నమోదు చేసిన ఇరాన్ న్యాయస్థానం.. ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన, అనైతికమైన కంటెంట్‌ను ప్రచురించారనే అభియోగాలపై అహ్మదీతో పాటు మరో నలుగురికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది.
అంతేకాకుండా, వారిపై రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలు, కళా, సంగీత కార్యకలాపాల్లో పాల్గొనడంపై నిషేధం కూడా విధించింది. తాజాగా నవంబర్ 23న ఖోమ్‌లోని ప్రాసిక్యూటర్ కార్యాలయంలో శిక్షను అమలు చేసినట్లు గాయని తరఫు న్యాయవాది వెల్లడించినట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, 2022లో హిజాబ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై అరెస్టయిన మహ్సా అమినీ కస్టడీలో మరణించిన ఘటన ఇరాన్‌లో మహిళల హక్కులపై పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. తాజా ఘటనతో అక్కడ మహిళల వస్త్రధారణ, కళాత్మక వ్యక్తీకరణ, భావప్రకటనా స్వేచ్ఛపై అమలవుతున్న ఆంక్షలు మరోసారి అంతర్జాతీయ చర్చకు వచ్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!