

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మలయప్పస్వామివారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి హారతులు సమర్పించారు. వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో శ్రీవారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుని అలంకరణలో మలయప్పస్వామి భక్తులను అలరించారు. అయితే వాహనసేవ సమయంలో భారీ వర్షం కురవడంతో ఘటాటోపం కింద నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య అశ్వవాహనసేవ జరగనుంది. బుధవారం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య బ్రహ్మోత్సవాల ముగింపుగా చక్రస్నానం నిర్వహించనున్నారు. సోమవారం జరిగిన వాహనసేవల్లో పెద్దజీయర్, చిన్నజీయర్, టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!