

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, రష్యా మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాల్లో భారీ ఆర్థిక ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ట్రంప్ ప్రభుత్వం రష్యాతో జరుపుతున్న చర్చలు కేవలం యుద్ధ విరమణ, రాజకీయ పరిష్కారానికే పరిమితం కాకుండా బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందంపై కూడా సాగుతున్నట్లు పేర్కొంది. అమెరికా మధ్యవర్తులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌తో సంబంధాలున్న పశ్చిమాసియా వ్యాపార వర్గాలకు ఈ ప్రతిపాదన ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఈ ఒప్పందానికి అమెరికా ప్రభుత్వం, క్రెమ్లిన్ ఆమోదం అవసరం.
ఈ ప్రతిపాదనలో రష్యా ఇంధన సంస్థ లూకోయిల్‌కు చెందిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, గ్యాస్ స్టేషన్ల ఆస్తులు ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5న క్రెమ్లిన్‌లో పుతిన్‌తో విట్కాఫ్, కుష్నర్ సమావేశమైన సమయంలో ఈ ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు ప్రస్తావించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికన్ బిలియనీర్ టాడ్ బోహ్లీతో పాటు పశ్చిమాసియాకు చెందిన రెండు వ్యాపార సంస్థలు, అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ విభాగం ఈ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ డీల్ తుది రూపం దాల్చిందా అనే దానిపై స్పష్టత లేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!