

వరంగల్లోని పాత సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 20న దసరా సందర్భంగా ఆసుపత్రిలో ఓపీ సేవలను ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సహచర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఎల్. నాగరాజు, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, వైద్యశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, వైద్యులు, ఆర్అండ్బీ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఆసుపత్రిలోని వైద్య విభాగాలు, రోగులకు కల్పించనున్న సదుపాయాలు, చికిత్సకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని పనులను వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు. అక్టోబర్ 17న మరోసారి పనులను పరిశీలిస్తామని, డిసెంబర్ నాటికి ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!