

ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలు, ఉచిత లావాదేవీల పరిమితులు, అదనపు ఛార్జీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. నవంబర్ 27, 2026న విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు గతంలో జారీ చేసిన పలు సూచనలను ఒకే విధానంలోకి తీసుకొచ్చాయి. సేవింగ్స్ ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇందులో నగదు ఉపసంహరణతో పాటు బ్యాలెన్స్ చెక్ వంటి ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కూడా ఉంటాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో నెలకు మూడు, నాన్‌మెట్రో ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం ఉచిత లావాదేవీలు ఐదుకు మించకూడదు.
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఒక్కో నగదు ఉపసంహరణకు గరిష్ఠంగా రూ.10,000 పరిమితి ఉంటుంది. ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత ప్రతి అదనపు లావాదేవీపై బ్యాంకులు గరిష్ఠంగా రూ.23తో పాటు వర్తించే పన్నులను వసూలు చేయవచ్చు. సాంకేతిక సమస్యలు, ఏటీఎంలో నగదు లేకపోవడం, బ్యాంకు లేదా సేవా సంస్థకు సంబంధించిన లోపాలు, తప్పు పిన్ లేదా ధృవీకరణ సమస్యల వల్ల విఫలమైన లావాదేవీలను ఉచిత లావాదేవీల లెక్కలో చేర్చకూడదు. వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదు. ఖాతాదారులు ఇప్పటికే వినియోగించిన ఉచిత లావాదేవీల సంఖ్య, తదుపరి లావాదేవీలపై పడే ఛార్జీల వివరాలను బ్యాంకులు తెలియజేయాలి. అలాగే ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉపసంహరణ పరిమితులు, ఛార్జీల వివరాలను ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషల్లో ప్రదర్శించాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!