

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రానికి విడుదల తేదీ విషయంలో మరోసారి అయోమయం నెలకొంది. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పటికీ చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో ఆ తేదీకి సినిమా వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ వరుసగా ఎక్కువ రోజులు కేటాయించడంతో ఒకేసారి పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నామని మేకర్స్ ధీమాగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. దీనికితోడు డిసెంబర్ 4న దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’, విశ్వక్‌సేన్ ‘లెగసీ’, నాగచైతన్య ‘వృషకర్మ’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ సినిమా పోటీలో ఉన్న సమయంలో ఇన్ని చిత్రాలు విడుదల తేదీలను ప్రకటించడం కూడా ‘ఫౌజీ’ వాయిదా పడే అవకాశాలపై అనుమానాలు పెంచుతోంది.
ఒకవేళ ‘ఫౌజీ’ డిసెంబర్ విడుదల నుంచి తప్పుకుంటే తదుపరి సరైన తేదీ దొరకడం అంత సులభం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో పలు సినిమాలు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. సంక్రాంతి తర్వాత పరీక్షల కాలం ప్రారంభం కానుండటంతో వెంటనే విడుదలకు అనుకూలమైన సమయం దొరకకపోవచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ‘ఫౌజీ’ వచ్చే ఏడాది వేసవి వరకు వెళ్లే అవకాశాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. అయితే సినిమా పనులు ఎంత వేగంగా పూర్తవుతాయనే అంశంపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు డిసెంబర్ 3నే అధికారిక విడుదల తేదీగా ఉన్నప్పటికీ, మార్పుపై మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!