

తెలంగాణ మట్టి వాసన, పల్లెటూరి జీవనశైలి, సహజమైన యాసకు తన సినిమాల్లో ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి అదే నేపథ్యంలో కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నాని హీరోగా తెరకెక్కించిన ది ప్యారడైజ్‌లోనూ తెలంగాణ వాతావరణాన్ని చూపించారు. అయితే ఈసారి యాక్షన్, మాస్ అంశాలకు బదులుగా ప్రేమకథను ఎంచుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2014 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సాగే గాఢమైన ప్రేమకథగా ఈ చిత్రం ఉండొచ్చనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.
ఉద్యమ సమయంలో నెలకొన్న పరిస్థితులు, అప్పటి సామాజిక వాతావరణం, ప్రేమికులు ఎదుర్కొన్న సమస్యలు కథలో భాగమవుతాయా అనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు గ్రామీణ నేపథ్యం, బలమైన పాత్రలు, యాక్షన్ సన్నివేశాలతో ప్రత్యేకత చాటుకున్న శ్రీకాంత్ ఓదెల కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కథా రచన దశలోనే ఉందని సమాచారం. ఇందులో కథానాయకుడిగా ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. ఈ ప్రేమకథకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడైతే మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!