

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన ‘భరతవర్ష: సాగా ఆఫ్ శూల్’ అనే చారిత్రక యాక్షన్ డ్రామాతో పాటు ‘సింగ’ చిత్రంలో నటిస్తున్నారు. వీటితోపాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVCC) బ్యానర్లో మరో భారీ చిత్రానికి గోపీచంద్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో కుమార్ మిస్టిక్ దర్శకుడిగా పరిచయం కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లండన్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైనట్లు, తదుపరి షెడ్యూళ్లను పారిస్, స్కాట్లాండ్లలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టులో గోపీచంద్‌కు జోడీగా మోడల్ కనక్ అగ్నిహోత్రి నటించనున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. మిస్ యూనివర్స్ ఉత్తరప్రదేశ్ 2024 టైటిల్‌ను గెలుచుకోవడంతోపాటు, మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీల్లో జాతీయ స్థాయి ఫైనలిస్ట్‌గా నిలిచినట్లు సమాచారం. అలాగే మిస్ నవీ ముంబై, మిస్ ముంబై టైటిళ్లను కూడా ఆమె సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో కనక్ టాలీవుడ్లో కథానాయికగా పరిచయం కానున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే, ఆమె ఎంపికపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!