

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ మహిళలను అత్యంత అవమానకరంగా చూపించే అసభ్యకర వీడియోలను రూపొందించడంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తికి లేదా ఒక సినిమాకు మాత్రమే సంబంధించిన సమస్య కాదని, ఈరోజు ఒకరికి ఎదురైన పరిస్థితి రేపు మరొకరికి ఎదురుకావచ్చని అన్నారు. ఇలాంటి కంటెంట్‌ను సృష్టించే వారితో పాటు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర అనుబంధ సినీ సంఘాలతో చర్చించి AI దుర్వినియోగంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని చిరంజీవి సూచించారు. సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేస్తూ బాధితులకు అండగా నిలవడం, అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవడం, బాధ్యులపై న్యాయపరమైన చర్యలు కొనసాగించడం కమిటీ లక్ష్యాలుగా ఉండాలని అన్నారు. సినీ పరిశ్రమతో పాటు కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, అభిమానులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేవరలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన AI మార్ఫింగ్ వీడియోపై ఇప్పటికే ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన విషయం తెలిసిందే.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!