

నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ హిందీ చిత్రం ఇటీవల విడుదలై ఏకంగా రూ.452.86 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, తనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదని దర్శకుడు విశాల్ చతుర్వేది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సినిమా సాధించిన విజయంపై చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన స్పందన గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. భారీ వసూళ్లు సాధించినప్పటికీ, ప్రముఖ నిర్మాణ సంస్థలు లేదా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు తన సినిమాను బహిరంగంగా అభినందించకపోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంపై విశాల్ చతుర్వేది మాట్లాడుతూ.. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటనలు విడుదల చేస్తూ చిత్ర బృందాన్ని అభినందిస్తుంటాయని తెలిపారు. అయితే ‘హనుమాన్ అంశ్’ విషయంలో మాత్రం ఒక్క ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు చాలామంది సినిమా బాగుందని ప్రశంసించినప్పటికీ, బహిరంగంగా అభినందించిన వారు మాత్రం చాలా తక్కువమందేనని చెప్పారు. వారిలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారని వెల్లడించారు. తన సినిమా విజయాన్ని గుర్తిస్తూ ఏ ప్రముఖ స్టూడియో లేదా నిర్మాణ సంస్థ లేఖ పంపలేదని, కనీసం అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇంతటి విజయాన్ని సాధించిన సినిమాకు పరిశ్రమ నుంచి తగిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంపై దర్శకుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!