

పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం, శ్రీ భవానీ మండల దీక్షల స్వీకరణ పర్వదినం నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం, భవానీ దీక్షా మాలధారణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి అమ్మవారి అంతరాలయ దర్శనాలను నిలిపివేసి, సాధారణ భక్తులకు సత్వర దర్శనానికి ప్రాధాన్యత కల్పించారు. స్కానింగ్ పాయింట్ వద్ద అధికారులు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించారు.
దేవస్థానం ఈవో వి.కె. శీనానాయక్ కొండపైన, దిగువ ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. దర్శన క్యూలైన్ల నిర్వహణ, ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఘాట్ రోడ్డు, కనకదుర్గ నగర్ వైపు నుంచి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బ్యాటరీ వాహనాల సేవలను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ సేవలను నిరంతరాయంగా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తుల ఫీడ్‌బ్యాక్‌లో ప్రస్తావించిన సమస్యలపై ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను తెలియజేసిన భక్తులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని అధికారులకు స్పష్టం చేశారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!