

మహిళలను కించపరిచేలా ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసి అసభ్యకరమైన కంటెంట్ రూపొందించడంపై చిత్ర పరిశ్రమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటను ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన ఘటనపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ సహా పలువురు నటీనటులు ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలో కథానాయిక జాన్వీకపూర్ కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా ఏఐ కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేయడం అత్యంత అవమానకరమని ఆమె పేర్కొన్నారు. మహిళ దుస్తులు, శరీరం, వ్యక్తిగత హద్దులకు సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా ఆమె స్వంతమని, ఒక మహిళ ‘వద్దు’ అని చెబితే దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని స్పష్టం చేశారు. వాస్తవ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, అసురక్షిత పరిస్థితులు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ కొత్త రూపంలో కొనసాగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఆలోచనా విధానం, పెంపకం, బాధ్యతాయుత ప్రవర్తన మారాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ అంశంపై స్పష్టంగా స్పందించిన ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!