

నితిన్ మరో విభిన్న ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే కథాంశం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇందులో నితిన్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్నాడు. అతడు ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. అయితే అతడికి మరో రహస్యమైన అలవాటు ఉంటుంది. శృంగార కథలతో కూడిన నవలలు రాస్తుంటాడు. ఈ విషయం నచ్చని అతడి కుటుంబ సభ్యులు అతడిని వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలో పెళ్లి సంబంధం ద్వారా పరిచయమైన అమ్మాయితో కృష్ణ ప్రేమలో పడతాడు. అయితే ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించకపోవడంతో అతడు ఎదురుచూస్తుంటాడు.
కృష్ణ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి అతడిని తిరస్కరిస్తుందని చెబుతూ నిరుత్సాహపరుస్తుంటారు. అయినప్పటికీ ఆమె తనను పెళ్లి చేసుకుంటుందనే నమ్మకంతో కృష్ణ ఉంటాడు. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలతో కూడిన కథగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. ముఖ్యంగా కథానాయకుడి విభిన్న వ్యక్తిత్వం, అతడి నవలల కారణంగా ఎదురయ్యే సమస్యలు కథలో ఆసక్తిని పెంచనున్నాయి. బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ‘ధండోరా’ సినిమాతో గుర్తింపు పొందిన మురళీ కాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి ఘంటా నిర్మిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!