

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా ‘రంగస్థలం’ ఫేమ్ నటి పూజిత పొన్నాడ ఈ చిత్ర బృందంపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాను యూకేలో ఉన్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి సినిమాలో అవకాశం గురించి చెప్పారని ఆమె వెల్లడించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో సంతోషంగా హైదరాబాద్కు వచ్చి ఆడిషన్ ఇచ్చానని, ఆ తర్వాత త్రివిక్రమ్ తనను ఎంపిక చేశారని తెలిపింది.
సినిమా తొలి షెడ్యూల్లో తనను షూటింగ్కు పిలిచారని, ఆ తర్వాత దాదాపు మూడు నెలల పాటు రెండో షెడ్యూల్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పూజిత పేర్కొంది. ఈ విషయంపై అసిస్టెంట్ డైరెక్టర్లను సంప్రదించగా, తన పాత్రలోకి మరో నటిని తీసుకున్నట్లు చెప్పారని వెల్లడించింది. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సినిమా నుంచి తొలగించడంపై బాధపడ్డానని తెలిపింది. అయితే సినిమా విడుదలైన తర్వాత మరోసారి షాక్కు గురయ్యానని, సినిమాలోని ఓ సన్నివేశంలో తాను కనిపించానని చెప్పింది. ఆ ఒక్క సీన్ కోసమే తనను ఉపయోగించుకున్నారని పూజిత ఆరోపించింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చకు దారితీశాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!