

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఈత’. మరాఠీ జానపద కళారంగంలో విశేష గుర్తింపు పొందిన విఠాబాయి నారాయణగావ్కర్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా కపూర్.. విఠాబాయి పాత్ర కోసం తాను చేసిన కృషి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు అంగీకరించే సమయానికి తనకు లావణి నృత్యంపై పెద్దగా అవగాహన లేదని చెప్పారు. పాత్రకు సిద్ధమయ్యేందుకు పలు వర్క్‌షాప్‌లలో పాల్గొనడంతో పాటు, శకుంతల జీ వంటి సీనియర్ కళాకారులను కలిసి లావణి నృత్యంలోని ప్రత్యేకతలను, తమాషా కళాకారుల జీవన విధానాన్ని తెలుసుకున్నానని వివరించారు. గజ్జెలు కట్టుకుని నృత్య అడుగులు వేయడం ఒక ఎత్తయితే, ఆ కళాకారుల జీవితాల్లోని కష్టాలు, బాధలు, సంతోషాలను హావభావాల ద్వారా తెరపై చూపించడం అసలైన సవాలని శ్రద్ధా పేర్కొన్నారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక్కో కాలికి నాలుగు కిలోల బరువున్న గజ్జెలు కట్టుకుని, మొత్తం ఎనిమిది కిలోల బరువుతో నృత్యం చేసినట్లు శ్రద్ధా వెల్లడించారు. ఓ పాట చిత్రీకరణ సమయంలో గాయపడటంతో కొంతకాలం షూటింగ్‌కు విరామం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ప్రతి పాట చిత్రీకరణకు ముందు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రెండు నుంచి మూడు వారాల పాటు కఠినమైన రిహార్సల్స్ చేయించేవారని, అవే తనకు పాత్రలో ఒదిగిపోయేందుకు సహాయపడ్డాయని చెప్పారు. ఇక సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ.. తనకు కథే అన్నింటికంటే ముఖ్యమని శ్రద్ధా స్పష్టం చేశారు. 80 లేదా 90 ఏళ్ల వయసులో తన సినీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ‘ఈత’ వంటి మంచి కథలతో కూడిన సినిమాలు చేయలేకపోయాననే బాధ ఉండకూడదని, అందుకే అర్థవంతమైన కథల కోసం ఎదురుచూస్తుంటానని పేర్కొన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!