

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుపై మారణాయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 65 మందిని అరెస్ట్ చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 66కు చేరింది. నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
తిమ్మాపురం సర్పంచ్ పదవికి టీడీపీ నేత నాగండ్ల రాంబాబు వర్గం, పావులూరి శ్రీనివాసరావు వర్గం పోటీ పడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అందిన సమాచారంతో పోలీసులు శ్రీనివాసరావుకు చెందిన పత్తి మిల్లులో తనిఖీలు నిర్వహించారు. అక్కడ 60 కర్రలు, నాలుగు కత్తులు, 25 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి సుమారు 25 కార్లలో కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడికి సిద్ధమవుతున్నారన్న సమాచారంతో సోదాలు చేపట్టినట్లు ఏఎస్పీ వివరించారు. పట్టుబడిన వారిలో గుంటూరుకు చెందిన ఓ రౌడీషీటర్ ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు. అరెస్టులకు నిరసనగా నాదెండ్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన శ్రీనివాసరావు అనుచరులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న మరో 34 మంది పరారీలో ఉన్నట్లు, వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!