

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం తమ తదుపరి చిత్రం ‘రణబాలి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత జీవితం, ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుల గురించి ఇద్దరూ మాట్లాడారు. ‘మైలురాయి’ వంటి పదాలను తాను పెద్దగా పట్టించుకోనని విజయ్ చెప్పగా.. చిన్న చిన్న క్షణాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ముఖ్యమని రష్మిక పేర్కొంది. ప్రతి పుట్టినరోజు, ప్రత్యేక సందర్భాన్ని గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ఆమె చెప్పింది.
రష్మిక వ్యాఖ్యలకు స్పందించిన విజయ్.. తన జీవితంలోకి సెలబ్రేషన్స్‌ను తీసుకొచ్చింది ఆమెనే అని చెప్పాడు. ఇకపై ఎక్కువ హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇప్పటివరకు పని, కెరీర్, సాధించాల్సిన లక్ష్యాలపైనే దృష్టి పెట్టి జీవితాన్ని ఓ పోరాటంలా చూసేవాడినని, ఇప్పుడు సంపాదించిన దాన్ని జీవితాన్ని ఆస్వాదించేందుకు ఉపయోగించుకోవడం కూడా ముఖ్యమని అర్థమైందని చెప్పాడు. కష్టాలు, సవాళ్లతో పాటు సంతోషకరమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడం కూడా అవసరమని రష్మిక పేర్కొంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!