

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు హీరో విజయ్ దేవరకొండ మద్దతుగా నిలిచారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజం ఎంతటి దిగజారుడు స్థాయికి చేరిందో ఈ ఘటన చూపిస్తోందని విజయ్ వ్యాఖ్యానించారు. ఇతరులను కించపరిచేందుకు సాంకేతికతను ఉపయోగించడం ఆందోళనకరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధ్యులకు శిక్ష పడటంతో పాటు, ఈ చర్యలు ఇతరులకు గుణపాఠంగా నిలవాలని పేర్కొన్నారు.
కాగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’లోని ‘చుట్టమల్లే’ పాటను ఏఐ సాంకేతికతతో అభ్యంతరకరంగా మార్ఫ్ చేసిన వీడియోపై ఇప్పటికే తీవ్ర దుమారం రేగింది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్.. మహిళలను అవమానించేలా ఏఐని ఉపయోగించడం సిగ్గుచేటని పేర్కొంటూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా విజయ్ దేవరకొండ స్పందించారు. ఏఐని సృజనాత్మక ప్రయోజనాలకు ఉపయోగించాల్సిన సమయంలో ఇలాంటి దుర్వినియోగం జరగడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!