

థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించని కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలకు డిజిటల్ వేదికలపై విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ జాబితాలో 'దాయరా' చేరింది. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే 3.2 మిలియన్ల వ్యూస్, 7.4 మిలియన్ల వ్యూయింగ్ అవర్స్ సాధించింది. గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ టాప్-10 సినిమాల జాబితాలో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో టాప్-10లో నిలవగా, భారత్, యూఏఈ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్, మాల్దీవులు, పాకిస్థాన్ సహా 10 దేశాల్లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది.
2019లో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ ఘటన, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. ఓ యువతి హత్యాచార కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన డీసీపీ రమణ్ కుమార్ ప్రజల దృష్టిలో హీరోగా మారతారు. అయితే ఆ ఎన్‌కౌంటర్ బూటకమనే ఆరోపణలు రావడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు డీసీపీ అజూనీ కోహ్లీగా కరీనా కపూర్ ఖాన్ రంగంలోకి దిగుతారు. తక్షణ న్యాయం, చట్టబద్ధమైన విచారణ మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రగతి మిశ్రా, భవేష్ బబ్బాని, క్షితీ జోగ్, కన్వల్జిత్ సింగ్, అనూజా సాఠే కీలక పాత్రలు పోషించారు. ఉత్కంఠభరితమైన కథనంతో సాగుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!