

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇప్పటికే ‘ది ఒడిస్సీ’, ‘ప్రేమదే ఊరళి’ (తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’) వంటి చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటితో పాటు ‘అనుపమ క్రేజీ కళ్యాణం’, ‘హైకూ’, ‘అనుమాన పక్షి’, ‘418’, ‘అన్బిల్ అవన్’ తదితర సినిమాలు కూడా ఈ వీకెండ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే, వీటన్నింటికంటే ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆసక్తికరమైన కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగుతున్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ‘మేడమ్ ఇన్‌స్పెక్టర్’ పేరుతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కథ కోల్‌కతాలో పనిచేసే పోలీస్ ఆఫీసర్ చిత్రా బసు (సందీప్తా సేన్) చుట్టూ తిరుగుతుంది. ఆమె పోలీస్ ఉద్యోగం చేయడం అత్తమామలకు ఇష్టం లేకపోయినా, భర్త ప్రోత్సాహంతో తన విధులను కొనసాగిస్తుంది. మరోవైపు, చిన్నతనంలో ఎదురైన ఓ సంఘటన ఆమెను వెంటాడుతుండటంతో పాటు, పై అధికారుల నుంచి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో వరుసగా అనుమానాస్పద మరణాలు చోటుచేసుకుంటాయి. పెళ్లి వేడుకకు కొద్ది సమయం ముందే వధువులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ కేసులను విచారించే క్రమంలో చిత్రాకు ఓ కీలక విషయం తెలుస్తుంది. హత్యకు గురవుతున్న మహిళలంతా రెండో పెళ్లి చేసుకోబోతున్నవారేనని ఆమె గుర్తిస్తుంది. అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? రెండో పెళ్లి చేసుకునే మహిళలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? నిందితుడిని పట్టుకునే క్రమంలో చిత్రాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. బెంగాలీలో గతంలో ‘బీరాంగన’ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ను ఇప్పుడు ‘మేడమ్ ఇన్‌స్పెక్టర్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్ఝర్ మిత్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ బెంగాలీతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సందీప్తా సేన్ ఇన్‌స్పెక్టర్ చిత్రా బసుగా నటించగా, నిరంజన్ మండల్, ప్రతీక్ దత్తా, ఆదిత్య సేన్‌గుప్త తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!