

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందడి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు కూడా చేరింది. అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబుళరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన పలువురు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లి, వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. నెలల తరబడి నగరంలోనే ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే సొంతూరికి వస్తుంటారు. అయితే వీరందరికీ తమ గ్రామంలోనే ఓటు హక్కు ఉంది. వలస వెళ్లిన గ్రామస్థులంతా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వస్తే తన విజయావకాశాలు మెరుగుపడతాయని భావించిన కూటమి బలపరిచిన సర్పంచి అభ్యర్థి జయరామ్ మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఓబుళరెడ్డిపల్లి గ్రామస్థులను ఆయన స్వయంగా కలుసుకున్నారు. ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒకరోజు ముందుగానే సొంతూరికి రావాలని వారిని కోరారు. తమ కోసం ఇంతదూరం వచ్చి పలకరించిన అభ్యర్థి తీరుపై వలస కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ప్రయత్నాన్ని అభినందిస్తూ సత్కరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసేందుకు అభ్యర్థి హైదరాబాద్ వరకు వెళ్లడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!