

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వాటా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు విమర్శలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క రిజర్వాయర్ అయినా నిర్మించిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఎంతకాలం పనిచేశాయో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో జీవో నంబర్‌ను తప్పుగా ప్రస్తావించారని, ఒంగోలు బ్రాంచ్ కెనాల్‌ను నాగార్జున సాగర్ కెనాల్‌గా పేర్కొన్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిందని, బీఆర్ఎస్ హయాంలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదనంగా ఎంత భూమికి సాగునీరు అందించారో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలోని కుప్పం వరకు కృష్ణా జలాలు వెళ్తున్నప్పుడు పాలమూరుకు నీరు ఎందుకు అందడం లేదని నిలదీశారు. ఇవన్నీ హరీశ్‌రావు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!