

బీఆర్ఎస్ పార్టీనే తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ తమకు పోటీ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హిందువులను ఏకం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, ముస్లింలను ఒకతాటిపైకి తీసుకురావడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతోందని తెలిపారు. దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీలను కూడా అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మైనారిటీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకంగా ఉంటే వాటిని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో లభించే నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, దీనివల్ల పాఠశాలల్లో హాజరుశాతం పెరిగిందని తెలిపారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయకుండా ఉండేందుకు, వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తున్నారని, అక్కడ చదివే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. పాత పద్ధతుల్లో కొనసాగుతున్న ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని, ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యయంలో టాటా సంస్థ 86 శాతం భరిస్తోందని తెలిపారు. తెలంగాణ విద్యార్థులు కేవలం సంస్థల్లో ఉద్యోగాలు చేయడమే కాకుండా, సొంతంగా సంస్థలను స్థాపించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయని సీఎం పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!