

రాష్ట్రంలోని కొన్ని కాలనీలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించామని ప్రభుత్వం ప్రకటిస్తే సరిపోదని, ఈ వ్యవహారంలో బాధితులందరికీ శాశ్వతంగా న్యాయం చేయాలని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, భారాస నేతలు పరస్పరం ఆస్తుల వివరాలను బయటపెట్టుకుంటుండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. గత భారాస ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న భూకుంభకోణాలపై భాజపా రాజీలేని పోరాటం చేస్తోందని తెలిపారు.
22ఏ నిషేధిత జాబితా, ధరణి, భూభారతి పేర్లతో గత, ప్రస్తుత ప్రభుత్వాలు సాగించిన భూవ్యవహారాల్లోని అక్రమాలను అసెంబ్లీలో ఆధారాలతో సహా ప్రశ్నించామని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కేవలం నాలుగు కాలనీలకు మెమోలు జారీ చేసి సమస్య పరిష్కరించామని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంతమైన వ్యవహారంలో బాధితులకు శాశ్వత న్యాయం జరగాలంటే గత భారాస, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల భూకుంభకోణాలపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమక్షంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆధారాలను వెల్లడించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!