

కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రాజకీయ ఆట మొదలైందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని విమర్శించారు. బీజేపీకి తెలంగాణలో మూడు దశాబ్దాలుగా రాజకీయ అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో బత్తాయి ఆరెంజ్ రంగులో ఉంటే, తెలంగాణలో మాత్రం పింక్ రంగులో ఉంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ డబ్బింగ్ చెబితే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని, స్క్రిప్ట్ బీఆర్‌ఎస్‌ది కాగా ప్రజెంటేషన్ బీజేపీదని చామల విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొందని, తామే అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి చెప్పడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ నేతల వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని చామల ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం బీజేపీకి ఇష్టమా? కాదా? మూసీ అభివృద్ధి జరగకూడదా? హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపట్టకూడదా? అంటూ నిలదీశారు. హైదరాబాద్‌కు వచ్చే విదేశీయుల వీసాలు రద్దు చేసిన సందర్భంలో కిషన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధిపై కేంద్రమంత్రికి నిజంగా ఆసక్తి ఉందా అని ప్రశ్నిస్తూ, కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!