

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కేంద్ర సహకారం, వివిధ రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణను పారిశ్రామికవేత్తలకు వివరించారు. గత భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, గత 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని చంద్రబాబు తెలిపారు. కేవలం ఎంవోయూలకే పరిమితం కాకుండా వాటిని వాస్తవ పెట్టుబడులుగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, షిప్‌బిల్డింగ్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఏఐ వంటి రంగాల్లో ఏపీ అభివృద్ధి ప్రణాళికలను సీఎం వివరించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్క్రో ఖాతాను నవంబర్ 12, 13 తేదీల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి నదుల అనుసంధానంతో నీటి కొరతను తగ్గించే అవకాశం ఉందని, రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు జరిగాయని తెలిపారు. మరోవైపు పీయూష్ గోయల్ భారత అభివృద్ధి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. టెక్నాలజీ, పెట్టుబడులు, వాణిజ్యం, ప్రతిభకు రాష్ట్రం ప్రాధాన్యం ఇస్తోందని ప్రశంసించారు. కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమలు టీమ్ ఇండియాగా కలిసి పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన అన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!