

రాజస్థాన్ పురపాలక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. పలువురు మంత్రుల నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రజా మద్దతు పొందలేకపోయింది. ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా ప్రాతినిధ్యం వహిస్తున్న దుడు నియోజకవర్గంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వసార్, వ్యవసాయ శాఖ మంత్రి కిరోడీ లాల్ మీనా నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. నగరాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఝాబర్ సింగ్ ఖర్రా కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే, మాజీ మంత్రి రాజేంద్ర రాథోడ్ కుమారుడు, కోడలు మాత్రం విజయం సాధించారు. మొత్తంగా 17 మంది రాష్ట్ర మంత్రులు, ముగ్గురు కేంద్ర మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఆశించిన మద్దతును కూడగట్టలేకపోయారు.
మొత్తం 1,271 జిల్లా పరిషత్ స్థానాల్లో కాంగ్రెస్ 794 స్థానాలను కైవసం చేసుకోగా, 7,520 పంచాయతీ వార్డుల్లో 3,785 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి 357 జిల్లా పరిషత్ స్థానాలు, 2,213 పంచాయతీ వార్డులు దక్కాయి. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్‌పీ) 51 జిల్లా పరిషత్ స్థానాలు, 497 వార్డులను గెలుచుకుంది. పురపాలక, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు విస్తృత రాజకీయ అంశాలు, పౌర సమస్యలను పరిగణనలోకి తీసుకోగా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, ఆక్రమణలు, రహదారుల మరమ్మతుల్లో జాప్యం వంటి స్థానిక సమస్యలే కీలకంగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధులపై అసంతృప్తి, పార్టీలో వర్గపోరు, నాయకులు-క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కూడా బీజేపీ ఓటమికి కారణమయ్యాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఫలితాలు బీజేపీ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని కాంగ్రెస్ వ్యాఖ్యానించగా, తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు మరింత బలాన్నిచ్చాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!