

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై మతపరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌కు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యాయి. క్రీడల్లోకి మతాన్ని, రాజకీయాలను తీసుకురావడం సరికాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రంజీత్ రంజన్ హితవు పలికారు. ఆటలకు వాటి సొంత ప్రమాణాలు, ఎంపిక విధానాలు ఉంటాయని, ఆటగాళ్లు తమ ప్రతిభతోనే జట్టులో స్థానం సంపాదించి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులను రాజకీయ చర్చల్లోకి లాగడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మరోవైపు, తన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నప్పటికీ ఇమ్రాన్ మసూద్ వెనక్కి తగ్గలేదు. జట్టు ఎంపిక ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే జరగాలని, వారు ఏ ప్రాంతానికి చెందినవారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని అన్నారు. సిరాజ్‌తో పాటు మహమ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్ల విషయంలోనూ ఇదే ప్రమాణం పాటించాలని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, మజ్లిస్ నేత వారిస్ పఠాన్ కూడా మహమ్మద్ సిరాజ్‌కు మద్దతుగా మాట్లాడారు. ఆటగాళ్లను వారి పేర్ల ఆధారంగా కాకుండా ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. గతంలో సర్ఫరాజ్ ఖాన్, మహమ్మద్ షమీ విషయంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని వ్యాఖ్యానించారు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో సిరాజ్ అద్భుతంగా రాణించారని, ప్రస్తుతం కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు అతడిని బెంచ్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. దీంతో సిరాజ్ జట్టు ఎంపిక అంశం రాజకీయ వర్గాల్లోనూ, క్రికెట్ అభిమానుల్లోనూ చర్చకు దారితీసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!