

అర్నబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన పరిస్థితులు, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు నిరంతరం పనిచేయాలని స్పష్టం చేశారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను గురువారమే సమర్పించాలని ఆదేశించారు. పరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినందున, పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని మినహాయించి ఇతర బాధితులకు వెంటనే సాయం అందించాలని సూచించారు.
పంట నష్టాన్ని వేగంగా, పారదర్శకంగా అంచనా వేసేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని, ప్రతి రైతుకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లు, ఇతర ఉద్యాన పంటల మొక్కలను తిరిగి నాటే అవకాశాలను పరిశీలించాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల ద్వారా రైతులను ఆదుకోవాలని సూచించారు. రహదారులపై పడిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. విపత్తు సమయంలో సమర్థంగా పనిచేసిన అధికారులను అభినందించిన చంద్రబాబు, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!