

అర్నబ్ తుఫాన్ వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయని వివరించారు. ఉప్పాడ తీరంలో 40 బోట్లు, కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతాల్లో ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. నష్టాన్ని త్వరగా అంచనా వేసి బాధితులకు పరిహారం అందించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ కారణంగా బోట్లు, వలలు, ఇతర వేట సామగ్రిని కోల్పోయిన మత్స్యకారులందరికీ వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉప్పాడ ప్రాంతంలోని చేనేత కార్మికులకు జరిగిన నష్టాన్ని కూడా పవన్ కళ్యాణ్ మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లారు. భారీ వర్షాల వల్ల మగ్గాల్లోకి నీరు చేరడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడం కారణంగా చేనేత కార్మికుల పని, జీవనోపాధి ప్రభావితమయ్యాయని వివరించారు. నష్టాన్ని అంచనా వేసి అర్హులైన చేనేత కార్మికులకు తుఫాన్ పరిహారం అందించాలని కోరారు. ఇదే సమయంలో విపత్తు నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును ప్రశంసించారు. తుఫాన్ హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి శాఖల మధ్య సమన్వయం, పరిస్థితులపై నిరంతర సమీక్ష, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను అభినందించారు. సహాయక చర్యల్లో భాగస్వాములైన మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని కూడా ప్రశంసించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!