

సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దొంగలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పరిస్థితి తీసుకురావద్దని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. కనీసం కాంగ్రెస్ మంత్రులైనా నిజాయితీగా, పారదర్శకంగా పాలన అందించాలని హితవు పలికారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి విషయాల్లో ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా, అవినీతికి తావులేకుండా పాలన సాగించాలని మంత్రులను కోరారు.
మంత్రులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకుని ప్రజలకు మంచి పాలన అందించడంపై దృష్టి పెట్టాలని రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించి, ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేలా చూడాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేస్తే ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని అన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం కంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమిటి, ప్రస్తుతం వాటి అమలుకు ప్రభుత్వం చేస్తున్నదేమిటి అనే అంశాలపై దృష్టి పెట్టాలని ప్రశ్నించారు. మంత్రులు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకుని, అవినీతి లేకుండా నిజాయితీగా పాలన అందిస్తున్నారా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విమర్శలపై మరోసారి చర్చకు దారితీశాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!