

ముప్కాల్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను మంత్రిగా ఉండటాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వెంట పడుతూ వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాళ్లు మొక్కించుకునే సంస్కృతికి చెందిన వ్యక్తిని కాదని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ కాళ్లు మొక్కించుకునే వారిని ఎదిరించే సంస్కృతి తనదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ తాను ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని గుర్తుచేశారు. ఆ సమయంలో తన సేవలను గుర్తించకుండా కొందరు హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసిన తనపై ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసినట్లు చెబుతున్న 'సిగ్గుండాలి' అనే వ్యాఖ్యపైనా సీతక్క తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఎలాంటి రాజకీయ సంస్కారమని ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవం విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోనని స్పష్టం చేశారు. మహిళలను అవమానించే వారిని ఎదిరించిన చరిత్ర తనదని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగతంగా మహిళలను అవమానించే స్థాయికి దిగజారడం సరికాదని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ప్రస్తావించే సంస్కారం ఇదేనా అంటూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా మహిళల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడాలని సూచించారు. ముప్కాల్ వేదికగా సీతక్క చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!