

ప్రధాని నరేంద్ర మోదీ అరెస్టు కాకుండా కాంగ్రెస్‌లోని కొందరు నాయకులే దర్యాప్తును అడ్డుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో సోనియా గాంధీ రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అమిత్ షా తర్వాత అరెస్టు కావాల్సిన వ్యక్తి నరేంద్ర మోదీయేనని మొయిలీ పేర్కొన్నారు. అయితే, అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కొందరు నాయకులు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా మొయిలీ మాట్లాడుతూ.. దర్యాప్తును అడ్డుకున్నది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కాదని, తమ ప్రభుత్వంలోని ఇతర నాయకులేనని అన్నారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. మొయిలీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకున్న పరిణామాలు, అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ నిర్ణయాలపై మరోసారి చర్చకు దారితీశాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!