

కేవలం 19 ఏళ్ల పాటు బొగ్గు అందించే గని కోసం 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని కనుమరుగు చేస్తారా? అని భారాస నేత, మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామప్ప ఆలయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్ వద్ద సింగరేణి కాలరీస్ ఓపెన్‌కాస్ట్ మైనింగ్ చేపట్టాలన్న నిర్ణయాన్ని భారాస తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప ఆలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వినోద్‌కుమార్ కోరారు. అక్కడ బంగారం లభించినా రామప్ప ఆలయానికి నష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టకూడదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సింగరేణి అధికారులతో చర్చించి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ ప్రతిపాదనను విరమింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు భారాస నేతలు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!