

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఫారం-6లో చట్ట విరుద్ధమైన మార్పులు చేసి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే సీఈసీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఉపయోగిస్తున్న ఫారం-6లో చేసిన మార్పులను తాము ఆమోదించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు జ్ఞానేశ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం’ అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీని ఎంతగానో భయపెడుతున్న జెన్ జీ ఓటర్లను తొలగించేందుకే సీఈసీ జ్ఞానేశ్ ఫారం-6ను ఉద్దేశపూర్వకంగా మార్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ దుయ్యబట్టారు. జ్ఞానేశ్ అబద్ధాలు చెప్పి, చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టమైందన్నారు. మరోవైపు, ఎన్నికల సంఘంతో పాటు అన్ని సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయనడానికి సుప్రీంకోర్టు ఈసీతో పాటు కేంద్రానికి జారీ చేసిన నోటీసులే నిదర్శమని బీజేపీ పేర్కొంది. దేశంలో ఎలాంటి భయ వాతావరణం, నియంతృత్వం లేదని స్పష్టం చేసింది. ‘దేశం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తోంది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. అన్ని వ్యవస్థలు నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయి. మెరుగైన ప్రజాస్వామ్యానికి ఇంతకంటే మరో ఉదాహరణ ఏముంటుంది..?’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!