

రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు మరణించిన 3 వేల మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రైతుబీమా పరిహారం చెల్లించాలని భారాస శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో భారాస నేతలతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. కొత్త బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెబుతూ రైతుబీమా ప్రీమియం చెల్లించకపోవడంతో వేలాది కుటుంబాలు బీమా ప్రయోజనాన్ని కోల్పోయాయని ఆరోపించారు. కరవు పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రభుత్వం సేకరణ చేపట్టడం లేదని, రైస్‌మిల్లర్ల యజమానులు, దళారులు కుమ్మక్కై తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ప్రకటించిన బోనస్‌పై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అందోలు, సంగారెడ్డి, జహీరాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో నీటి సమస్య పరిష్కారానికి నిజాంసాగర్ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా సింగూరులోకి తరలించి తాగునీరు అందించాలని సూచించారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మూడేళ్లు గడిచినా అమలు చేయలేదని ఒక ప్రకటనలో విమర్శించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలతో పోల్చి, తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ కూడా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను గుర్తించారని, రానున్న రోజుల్లో తగిన సమాధానం చెబుతారని హరీశ్‌రావు పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!