

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రానున్న పంచాయతీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలు రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకోవాలని నేతలకు సూచించారు.
పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికల్లో ప్రజాతీర్పు ఇప్పటికే వెల్లడైనందున, ఇకపై గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ఆధారంగా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉన్నవాటికి రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. గతంలో రూ.5 లక్షలుగా ఉన్న కనీస ప్రోత్సాహకాన్ని రూ.15 లక్షలకు, గరిష్ఠంగా ఉన్న రూ.20 లక్షలను రూ.50 లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు. గ్రామస్థాయిలో నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి, వ్యక్తిగత పంతాలు, ఈగోలకు తావులేకుండా ఐక్యంగా పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!