

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో పేర్ల అనువాదం వివాదానికి దారితీసింది. ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో జరిగిన పొరపాటు కారణంగా రామ్‌హిత్ యాదవ్ అనే ఓటరు పేరు ఇంగ్లిషులో ‘రామ్ హిట్ యాదవ్’గా, హిందీలో ‘రామ్‌నే యాదవ్ కో మారా’గా నమోదైనట్లు కథనం పేర్కొంది. హిందీ పదబంధానికి ‘రాముడు యాదవ్‌ను కొట్టాడు’ అనే అర్థం రావడంతో సదరు ఓటరు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన ఓటర్ల వివరాల అనువాదంలో సాఫ్ట్‌వేర్ ఖచ్చితత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసి, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా ప్రశ్నలు సంధించారు. ఇతర ఇంటిపేర్ల విషయంలో కాకుండా యాదవ్ పేరుతోనే ఇలాంటి అనువాదం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తూ, సాఫ్ట్‌వేర్‌లో కులపక్షపాతం ఉందా లేదా రాజకీయ అజెండా అమలవుతోందా అని వ్యాఖ్యానించారు. దీనిపై సోమవారం స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నవ్‌దీప్ రిన్వా, ఇంగ్లిషులోని పేర్లను హిందీలోకి అనువదించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారని, కొన్ని పేర్ల విషయంలో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. తప్పులను సరిచేస్తున్నామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!