

స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్ మరో కీలక ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం. వివిధ యాప్స్‌ను నియంత్రించడం, ఇంటర్నెట్లో సమాచారాన్ని వెతకడం, వెబ్సైట్లను బ్రౌజ్ చేయడం, కోడ్ రాయడం, ప్రోగ్రామింగ్‌లోని లోపాలను గుర్తించి సరిచేయడం వంటి పనులను స్వయంగా నిర్వహించగల అధునాతన ఏఐ ఏజెంట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాపిల్ అందిస్తున్న సిరి అసిస్టెంట్ ప్రధానంగా వినియోగదారులు ఇచ్చే ఆదేశాల ఆధారంగా పనిచేస్తుండగా, కొత్త ఏఐ ఏజెంట్ మాత్రం అనేక దశలతో కూడిన క్లిష్టమైన పనులను తక్కువ మానవ ప్రమేయంతో పూర్తి చేయగలదని అంచనా. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం యాపిల్ సీనియర్ ఇంజినీరింగ్ మేనేజర్‌ను నియమించుకునే ప్రయత్నాల్లో ఉంది. అవసరాన్ని బట్టి ప్రత్యేక ఏఐ ఏజెంట్లను సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తి చేసే సామర్థ్యం కూడా ఇందులో ఉండవచ్చని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీనిపై యాపిల్ అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు, మ్యాక్ కంప్యూటర్లను నియంత్రించే థర్డ్ పార్టీ ఏఐ ఏజెంట్లకు యాక్సెస్ విషయంలో యాపిల్ కఠినమైన నిబంధనలు తీసుకొస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. macOS 27.3 బీటా వెర్షన్లో ఇలాంటి ఏఐ టూల్స్‌కు అనుమతులు ఇచ్చే ముందు అదనపు హెచ్చరిక స్క్రీన్లను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో చాట్‌జీపీటీ కంప్యూటర్ కంట్రోల్ ఫీచర్‌ను ప్రారంభించడానికి నాలుగు దశలు అవసరమవగా, ఇప్పుడు ఆ సంఖ్య 14కు పెరిగినట్లు సమాచారం. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని, పరికరాల భద్రతను కాపాడేందుకే ఈ మార్పులు చేస్తున్నట్లు యాపిల్ చెబుతోంది. అయితే దీనివల్ల ఇతర ఏఐ సంస్థల సేవలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఐఓఎస్ 27.3లో థర్డ్ పార్టీ యాప్స్‌తో సిరి అనుసంధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. దీని ద్వారా క్యాబ్ బుకింగ్, రెస్టారెంట్ రిజర్వేషన్లు వంటి పనులను సిరి సహాయంతో నిర్వహించే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఈ మార్పులు పూర్తిస్థాయి స్వతంత్ర ఏఐ ఏజెంట్ సామర్థ్యాలకు సమానం కావని తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!