

ఇంటి భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అమెజాన్ కొత్త తరహా సెక్యూరిటీ పరికరాలను తీసుకొచ్చింది. తన రింగ్ సెక్యూరిటీ విభాగంలో భాగంగా డ్రోన్ కెమెరా, చక్రాలపై తిరిగే రోబో కెమెరాను పరిచయం చేసింది. వీటిలో ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే చోట ఉండి నిఘా పెట్టడం కాకుండా, ఇంట్లో లేదా ఆఫీసులో వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించగలవు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పరిసరాలను గుర్తించి, అడ్డంకులను తప్పించుకుంటూ నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణిస్తాయి.
రింగ్ డ్రోన్ కెమెరా ఇంట్లోని గదుల మధ్య ఎగురుతూ నిఘా పెట్టగలదు. రింగ్ యాప్‌లోనే దీని ప్రయాణ మార్గాలు, సమయాలను ముందుగా నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే నిర్దిష్ట ప్రాంతానికి పంపించవచ్చు. అనుసంధానించిన రింగ్ కెమెరా, సెన్సార్ లేదా అలారం ఏదైనా కదలికను గుర్తిస్తే.. ఈ డ్రోన్ వెంటనే గాల్లోకి లేచి ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి చేరుకుంటుంది. 2కే రిజల్యూషన్‌లో వీడియో రికార్డు చేస్తుంది. 148 డిగ్రీల వీక్షణ పరిధి, 360 డిగ్రీలు తిరిగే కెమెరా, చీకట్లో ఉపయోగపడే రెండు ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. తిరిగి తన డాకింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు రికార్డింగ్ ఆగిపోతుంది. మళ్లీ ఎగిరినప్పుడు ప్రారంభమవుతుంది. అమెజాన్ అలెక్సా హోమ్ మ్యాప్ ద్వారా కూడా దీన్ని నియంత్రించవచ్చు.
రింగ్ రోవర్ కెమెరాను దుకాణాలు, ఆఫీసులు, గిడ్డంగుల వంటి వ్యాపార ప్రదేశాల భద్రత కోసం రూపొందించారు. చక్రాల సాయంతో ప్రాంగణంలో తిరుగుతూ నిఘా పెడుతుంది. అనుసంధానించిన రింగ్ పరికరాలు ఏదైనా కదలికను గుర్తిస్తే అక్కడికి వెళ్లగలదు. దీని ప్రధాన కెమెరా 360 డిగ్రీల్లో పరిసరాలను పరిశీలిస్తుంది. కౌంటర్లు, షెల్ఫ్‌ల వెనుక ఉన్న ప్రాంతాలను చూడటానికి పైకి లేచే పెరిస్కోప్ కెమెరా కూడా ఉంది. కదులుతున్న సమయంలో 4కే రిజల్యూషన్ వరకు వీడియో రికార్డు చేయగలదు. సైరన్, లైట్ టవర్, టూ-వే ఆడియో సదుపాయాలు ఉన్నాయి. అంటే కెమెరా సమీపంలో ఉన్నవారితో మాట్లాడవచ్చు. ఒకేసారి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు పర్యవేక్షించగలదని కంపెనీ తెలిపింది.
ఈ రెండు పరికరాల్లోనూ ఏఐ పైలట్ వ్యవస్థ పనిచేస్తుంది. కెమెరాలు, సెన్సర్ల సాయంతో పరిసరాలను మ్యాప్ చేసి గదులు, తలుపులు, కిటికీలు, కారిడార్లను గుర్తిస్తుంది. వాటిని నిఘా పెట్టాల్సిన ప్రాంతాలుగా సూచిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చిన ప్రాంతాలను ఎంచుకుని, యాప్‌లోనే పర్యవేక్షణ మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్నిచర్ వంటి అడ్డంకులను గుర్తించి వాటిని తప్పించుకునేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. డ్రోన్ కెమెరా సెటప్ కోసం దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి పరిసరాలను పరిచయం చేయాలి. రోవర్ కెమెరా మాత్రం వ్యాపార ప్రాంగణాన్ని తానే పరిశీలించి మ్యాప్ రూపొందించుకోగలదు.
అమెరికాలో రింగ్ డ్రోన్ కెమెరా ధర 249.99 డాలర్లు (సుమారు రూ.23,400). 2027 జనవరి 27 నుంచి డెలివరీలు ప్రారంభం కావచ్చని అమెజాన్ వెల్లడించింది. అయితే అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) అనుమతి లభించాల్సి ఉంది. రింగ్ రోవర్ కెమెరా ధర 999.99 డాలర్లు (సుమారు రూ.93,000). దీని డెలివరీలు 2026 డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ రెండు పరికరాల ధరలు, విడుదల తేదీలను అమెజాన్ ఇంకా ప్రకటించలేదు. షెడ్యూల్ ప్రకారం నిఘా పెట్టడం, రికార్డైన వీడియోలను చూడటం వంటి సదుపాయాల కోసం అనుకూలమైన రింగ్ ప్రొటెక్ట్ సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి.
రికార్డింగ్ జరుగుతున్నప్పుడు రెండు పరికరాల్లోనూ ఎల్‌ఈడీ సూచికలు వెలుగుతాయి. డ్రోన్ కెమెరా డాకింగ్ కేంద్రంలో ఉన్నప్పుడు కెమెరా పనిచేయదు. రోవర్ కెమెరాలో స్లీప్ మోడ్ ఆన్ చేస్తే పెరిస్కోప్ లోపలికి ముడుచుకుంటుంది. మైక్రోఫోన్ కూడా నిలిచిపోతుంది. వీడియోల భద్రత కోసం తమ ‘త్రో అవే ది కీ’ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!