

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్వయంగా రచించిన బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం ఆధారంగా ఆమె జీవితాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని తెలుగులో సినిమాగా తెరకెక్కించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరించాలని సూచించారు. చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు 50 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ కార్యకలాపాలను గాంధీ భవన్ పీఆర్వో హరిప్రసాద్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జులకంటి ఆంజనేయులు సినిమా నిర్మాణానికి రూ.2 కోట్లు అందిస్తానని ప్రకటించారు. మిగతా నాయకులు, కార్యకర్తలు కూడా నిధుల సమీకరణకు సహకరించాలని జగ్గారెడ్డి కోరారు. తగిన బడ్జెట్ సమకూర్చుకుని మంచి దర్శకుడిని ఎంపిక చేస్తామని చెప్పారు. సోనియా గాంధీ జీవితాన్ని కార్యకర్తలు మరింతగా తెలుసుకునేందుకు ఆమె పుస్తక ప్రతులను తెప్పించి పంపిణీ చేస్తామని వెల్లడించారు.
సోనియా గాంధీ కుటుంబ జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తీరు వరకు సినిమాలో చూపిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తల్లిగా ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల తర్వాత కుటుంబం ఎదుర్కొన్న విషాద పరిస్థితులను కూడా ప్రస్తావిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవస్థను సోనియా గాంధీ లోతుగా అధ్యయనం చేశారని ఆయన ప్రశంసించారు. యూపీఏ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రధాని పదవిని స్వీకరించకుండా మన్మోహన్ సింగ్‌కు అవకాశం కల్పించిన ఆమె నిర్ణయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకోవడంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీల ఆలోచనలు కీలక పాత్ర పోషించాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సినిమా నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!