

విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో రూ.19 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ పార్కును కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. అలాగే WQ-1, WQ-2 బెర్త్‌ల అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. కార్గో హ్యాండ్లింగ్‌లో ప్రపంచంలోని టాప్ 20 పోర్టుల్లో విశాఖ పోర్టు స్థానం సంపాదించిందని, సరుకు రవాణా సామర్థ్యంతో పాటు నాణ్యమైన మానవ వనరులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. పోర్టు అభివృద్ధికి విశాఖ ప్రజలు అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు.
విశాఖలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ సమర్థవంతంగా పనిచేస్తోందని సోనోవాల్ పేర్కొన్నారు. దుగరాజపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధి కూడా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యాపారాలు, పెట్టుబడులు, అవకాశాలకు అనువైన రాష్ట్రంగా మారుతోందని అన్నారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని, ఇప్పటికే విశాఖలో ఐదు ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు 10 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది పోర్టు అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!